“Book Descriptions: 'అతడు అడవిని జయించాడు' లో కథా సమయాన్ని రచయిత ఒకానొక సూర్యాస్తమయాన మొదలెట్టి సూర్యోదయానికల్లా ముగిస్తాడు. ఈ అస్తమయ ఉదయాల మధ్య పందుల్ని సాకే ఓ అనామక ముసలివాడి బహిరంతర అన్వేషణ, అడవిలో చిక్కులు చిక్కులుగా ముళ్ళుపడి, మానవ జీవితంలోని అస్తిత్వ సంఘర్షణగా సామాన్యీకరించబడి తీగలు తీగలై నిర్నిరోదంగా సాగుతుంది. గుప్పెడు గంటల వ్యవధిలోనే కొన్ని కఠోర మరణాలు, ఇంకొన్ని అదివాస్తవిక జననాలు, సంక్లిష్ట సందేహాలు, గుబులుగొల్పే సందిగ్ధాలు, వెయ్యి వెయ్యిగా తలలేట్టే ప్రశ్నలు, భీతి కలిగించే హింస, విశ్వం మొత్తాన్ని గుండెల్లో పొదువుకునే అవ్యాజ ప్రేమభావం. అమాయక వాత్సల్యాలు, విశ్రుంఖలత్వం, విహ్వాలత్వం, వైవిధ్యం, మోహం, మార్మికత్వం, నిష్ఫలత్వం, నిరర్థకత, పాశవికత, నిస్పృహ, నిరీహ - ముసలివాడి అనుభవంలోకి నిరంతర ప్రవాహంగా ముప్పిరిగొని, అతణ్ణి నివ్వెర పరుస్తాయి.
అతని అంతరంగం, 'ఎక్కడో మొదలయ్యి ఎక్కడో అంతమయ్యే' అరణ్యంగా, సిద్ధపరచిన యుద్ధ రంగంగా సాక్షాత్కరిస్తుంది. మొత్తం కథ తాలూకు అనుభవంలో - అన్వేషణ ఒక్కటే వాస్తవం, సంఘర్షణ ఒక్కటే ప్రత్యక్షం. జీవితం తాలూకు సంక్లిష్ట ప్రశ్నలకు తేలికపాటి పనికిమాలిన చచ్చు సమాధానాల నిచ్చి భ్రమలు గొలిపే దుస్సాహసం చేయదీ నవలిక. జీవితంలో ఉక్కిరిబిక్కిరిగా అల్లుకున్న కఠోర వైరుధ్యాలను, అదివాస్తవికంగా - నిర్మమంగా - కర్కశంగా - ధైర్యంగా ఆవిష్కరింపజేస్తూ, పాఠకలోకం ముందు బహుముఖీన మానవ అస్తిత్వాన్ని శక్తిమంతంగా ప్రతిష్టించడమే దీని ప్రత్యేకత, విశిష్టత.” DRIVE